Thursday, September 14, 2017

PV Narasimaharao by adithyapakide.


పీవీ నరసింహారావు:

బాల్యం:

తెలంగాణ లోని వరంగల్ జిల్లా , నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామంలో 1921 జూన్ 28 న రుక్నాబాయి, సీతారామారావు దంపతులకు పీవీ జన్మించాడు. వరంగల్లు జిల్లాలోనే ప్రాథమిక విద్య మొదలుపెట్టాడు. తరువాత కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామానికి చెందిన పాములపర్తి రంగారావు, రుక్మిణమ్మలు ఆయనను దత్తత తీసుకోవడంతో అప్పటినుండి పాములపర్తి వేంకట నరసింహారావు అయ్యాడు. 1938 లోనే హైదరాబాదు రాష్ట్ర కాంగ్రెసు పార్టీలో చేరి నిజాము ప్రభుత్వ నిషేధాన్ని ధిక్కరిస్తూ వందేమాతరం గేయాన్ని పాడాడు. దీంతో తాను చదువుకుంటున్న ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఆయనను బహిష్కరించారు. దాంతో ఓ మిత్రుడి సాయంతో నాగపూరు విశ్వవిద్యాలయంలో చేరి నాగపూరులో ఆ మిత్రుడి ఇంట్లోనే ఉంటూ 1940 నుండి 1944 వరకు ఎల్లెల్బీ చదివాడు  . స్వామి రామానంద తీర్థ, బూర్గుల రామకృష్ణారావు ల అనుయాయిగా స్వాతంత్ర్యోద్యమంలోను, హైదరాబాదు విముక్తి పోరాటంలోను పాల్గొన్నాడు. బూర్గుల శిష్యుడిగా కాంగ్రెసు పార్టీలో చేరి అప్పటి యువ కాంగ్రెసు నాయకులు మర్రి చెన్నారెడ్డి , శంకరరావు చవాన్, వీరేంద్ర పాటిల్ లతో కలిసి పనిచేసాడు. 1951లో అఖిల భారత కాంగ్రెసు కమిటీలో సభ్యుడిగా స్థానం పొందాడు. నరసింహారావు తన రాజకీయ జీవితాన్ని జర్నలిస్టుగా ప్రారంభించి, కాకతీయ పత్రిక నడిపి అందులో జయ అనే మారుపేరుతో 1950 ప్రాంతాలలో వ్రాసేవాడు. బహుభాషలు నేర్చి ప్రయోగించాడు.

రాష్ట్ర రాజకీయాల్లో పీవీ:

1957 లో మంథని నియోజక వర్గం నుండి శాసనసభకు ఎన్నికవడం ద్వారా పీవీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రస్థాయి పదవీ రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. ఇదే నియోజకవర్గం నుండి వరుసగా నాలుగు సార్లు శాసన సభ్యునిగా ఎన్నికయ్యాడు. 1962 లో మొదటిసారి మంత్రి అయ్యాడు. 1962 నుండి 1964 వరకు న్యాయ, సమాచార శాఖ మంత్రి గాను, 1964 నుండి 67 వరకు న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి, 1967 లో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి, 1968-71 కాలంలో న్యాయ, సమాచార శాఖ మంత్రి పదవులు నిర్వహించాడు.
కులప్రాబల్యం, పార్టీ అంతర్గత వర్గాల ప్రాబల్యం అధికంగా ఉండే ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో పీవీధి ఒక ప్రత్యేక స్థానం. హంగూ ఆర్భాటాలు లేకుండా ఒదిగి ఉండే లక్షణం ఆయనది. తనకంటూ ఒక వర్గం లేదు. బ్రాహ్మణుడైన ఆయనకు కులపరంగా బలమైన రాజకీయ స్థానం లేనట్లే. పార్టీలో అత్యున్నత స్థాయిలో తనను అభిమానించే వ్యక్తులు లేరు. అయినా రాష్ట్ర రాజకీయాల్లో అత్యున్నత స్థాయికి ఎదిగాడు. ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్నవారెందరో ఉండగా ఆ పదవి ఆయన్ను వరించింది. అప్పటి రాజకీయ పరిస్థితి అటువంటిది.1969 నాటి ప్రత్యేక తెలంగాణా ఉద్యమం అప్పుడే చల్లారింది. ముఖ్యమంత్రిని మార్చడమనేది కాంగ్రెసు పార్టీ ముందున్న తక్షణ సమస్య. తెలంగాణా ప్రజల, ఉద్యమనేతల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని, తెలంగాణా ప్రాంత నేతను ముఖ్యమంత్రిగా ఎంపిక చెయ్యడమనేది అనివార్యమయింది. తెలంగాణా ప్రాంతం నుండి ముఖ్యమంత్రి పదవి ఆశించే వారు తక్కువేమీ లేరు. వివాదాల జోలికి పోని ఆయన వ్యక్తిత్వం, పార్టీలోని ఏ గ్రూపుకూ చెందని ఆయన రాజకీయ నేపథ్యం ఆయనకు 1971 సెప్టెంబర్ 30 న ముఖ్యమంత్రి పదవిని సాధించిపెట్టాయి.

ముఖ్యమంత్రిగా పీవీ:

ముఖ్యమంత్రిగా పీవీ రికార్డు ఘనమైనదేమీ కాదు. పీఠం ఎక్కీ ఎక్కగానే పార్టీలో అసమ్మతి తలెత్తింది. ఈ విషయమై అధిష్టానంతో చర్చించేందుకు ఢిల్లీ , హైదరాబాదుల మధ్య తిరగడంతోటే సరిపోయేది. రాష్ట్ర ప్రధానకార్యదర్శి ముఖ్యమంత్రితో మాట్లాడాలంటే, హైదరాబాదులో కంటే, ఢిల్లీలోనే ఎక్కువ వీలు కుదిరేదని ఒక రాజకీయ పరిశీలకుడు వ్యాఖ్యానించాడు .ఆ సమయంలోనే ముల్కీ నిబంధనలపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో ఆందోళన చెందిన కోస్తా , రాయలసీమ నాయకులు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోరుతూ జై ఆంధ్ర ఉద్యమం చేపట్టారు. పీవీని తెలంగాణా నాయకుల పక్షపాతిగా ఆంధ్ర, రాయలసీమ నాయకులు ఆరోపించారు. ఉద్యమంలో భాగంగా ఆ ప్రాంత మంత్రులలో చాలామంది రాజీనామా చేసారు. రాజీనామా చేసిన మంత్రుల స్థానంలో 1973 జనవరి 8 న కొత్త మంత్రులను తీసుకుని పీవీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేసాడు. అయితే పార్టీ అధిష్టానం ఆలోచన పూర్తిగా భిన్నంగా ఉంది. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగిన మరునాడే కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి, శాసనసభను సుప్తచేతనావస్థలో ఉంచి, రాష్ట్రపతి పాలనను విధించింది. ఆ విధంగా పీవీ ముఖ్యమంత్రిత్వం ముగిసింది. శాసనసభ సభ్యుడిగా 1977 వరకు ఆయన కొనసాగినా రాష్ట్ర రాజకీయాల్లో పూర్తిగా పక్కన పెట్టబడ్డాడు. 1972 లో పీవీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాసనసభ ఎన్నికలలో 70% వెనుకబడిన వారికిచ్చి చరిత్ర సృష్టించాడు .పీవీ దగ్గరనుండి అసలు విషయం రాబట్టటం అంత తేలిక కాదు. కరణం లౌక్యం అంతా ఉపయోగించేవాడు. ఆగ్రహాన్ని దాచేవాడని ప్రముఖ పాత్రికేయుడు ఇన్నయ్య ఆయన గురించి వ్రాశాడు. శాసనసభలో, లోక్ సభలో బాగా సిద్ధపడి వచ్చి మాట్లాడేవాడు. ప్రశ్నలకు సమాధానం చెప్పేవాడు. ముఖ్యమంత్రిగా భూ సంస్కరణలు, సీలింగు పరిమితులు తలపెట్టినప్పుడు ఆయనపై భూస్వామ్య వర్గాలు తిరగబడ్డాయి. అప్పడు వచ్చిన ప్రత్యేక ఆంధ్ర ఉద్యమాన్ని కూడా చేదు అనుభవంగా పి.వి. చవి చూచాడు.
తాను ముఖ్యమంత్రిగా ఉండగా భూసంస్కరణలను అమలుపరచేందుకు చర్యలు తీసుకున్నాడు. పట్టణ భూ గరిష్ట పరిమితి చట్టం తెచ్చింది కూడా పీవీయే. నిజానికి భూసంస్కరణల విషయంలో పీవీకి సమకాలీన రాజకీయ నాయకులతో ఉన్న విభేదాల కారణంగానే ఆయన ముఖ్యమంత్రి పదవిని కోల్పోవలసివచ్చిందని కొందరి వాదన.

కేంద్ర రాజకీయాల్లో పీవీ:

తరువాత పీవీ రాజకీయ కార్యస్థలం ఢిల్లీ కి మారింది. కాంగ్రెసు పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితుడయ్యాడు.


ప్రధానమంత్రిగా పీవీ:

ప్రధానమంత్రి పదవి అనుకోకుండా వరించింది. 1991 సార్వత్రిక ఎన్నికలలో పోటీ చెయ్యకుండా, దాదాపుగా రాజకీయ సన్యాసం తీసుకున్నాడు. ఆ సమయంలో రాజీవ్ గాంధీ హత్య కారణంగా కాంగ్రెసు పార్టీకి నాయకుడు లేకుండా పోయాడు. ఆ సమయంలో తనకంటూ ప్రత్యేక గ్రూపు లేని పీవీ అందరికీ ఆమోదయోగ్యుడుగా కనపడ్డాడు. దాదాపుగా వానప్రస్థం నుండి తిరిగివచ్చి
ప్రధానమంత్రి గా బాధ్యతలు స్వీకరించాడు. ఆంధ్ర ప్రదేశ్ లోని నంద్యాల లోక్ సభ  నియోజకవర్గం నుండి గంగుల ప్రతాపరెడ్డిచే రాజీనామా చేయించి, అక్కడి ఉప ఎన్నికలో గెలిచి, పీవీ లోక్సభలో అడుగుపెట్టాడు. సాటి తెలుగువాడు ప్రధాని ఆవుతున్నాడని నంద్యాల పార్లమెంట్ సీటుకు జరిగిన ఉప ఎన్నికలలో ఎన్.టి.రామారావు ఆయనపై తెలుగు దేశం అభ్యర్థిని పోటీలో పెట్టలేదు. అయితే ప్రభుత్వానికి, కాంగ్రెసు పార్టీకి అది చాలా క్లిష్టసమయం. ప్రభుత్వానికి సంపూర్ణ మెజారిటీ లేని పరిస్థితి. సహజ సిద్ధంగా ఉన్న తెలివితేటలు, కేంద్రంలో వివిధ మంత్రిత్వ శాఖల్లో ఆయనకు ఉన్న అపార అనుభవం ఆయనకు ఈ క్లిష్టసమయంలో తోడ్పడ్డాయి. ఐదు సంవత్సరాల పరిపాలనా కాలాన్ని పూర్తి చేసుకున్న ప్రధానమంత్రుల్లో నెహ్రూ , గాంధీ కుటుంబంబాల బయటి మొదటి వ్యక్తి, పీవీయే. మైనారిటీ ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తూ కూడా, ఇది సాధించడం ఆయన రాజనీతికి, చాకచక్యానికి నిదర్శనం. అందుకే ఆయన్ని అపర చాణక్యుడు అని అన్నారు. అందుకు ఆయన అనుసరించిన కొన్ని విధానాలు వివాదాస్పదం అయ్యాయి కూడా. ప్రధానిగా ఉండగా మన్మోహన్ సింగ్ ను ఆర్థిక మంత్రిగా తీసుకురావడం దేశ ప్రగతిలో కీలక మార్పుకు నాంది పలికింది. మరొకవైపు
బాబ్రీ మసీదు కూలగొట్టడం కూడా ఆయన హయాంలోనే జరిగింది. చూసీ చూడనట్లు పోనిచ్చాడనే నెపం ఆయనపై ఉంది.

సాహితీ కృషి:

రాజకీయాల్లో తీరికలేకుండా ఉన్నా, పీవీ తన ఇతర వ్యాసంగాలను వదిలిపెట్టలేదు. తనకు ప్రియమైన సాహిత్య కృషి, కంప్యూటరును ఉపయోగించడం వంటి పనులు చేస్తూనే ఉండేవాడు. కంప్యూటరును ఉపయోగించడంలో పీవీ ముందంజలో ఉండేవాడు. ఆయన చేసిన సాహిత్య కృషికి గుర్తింపుగా సాహిత్య అకాడమీ పురస్కారాన్ని కూడా అందుకున్నాడు. ఆయన రచనల్లో ప్రఖ్యాతి చెందినది ఇన్సైడర్ అనే ఆయన ఆత్మకథ. లోపలిమనిషి గా ఇది తెలుగులోకి అనువాదమయింది. నరసింహారావు బహుభాషాకోవిదుడు. ఇంగ్లీషు , హిందీయే కాక అనేక దక్షిణాది భాషలు, మొత్తం 17 భాషలు వచ్చు.

మరణం
తన ఆత్మకథ రెండో భాగం వ్రాసే ఉద్దేశం ఆయనకు ఉండేది. ఆ కార్యం నెరవేరకుండానే, 2004 , డిసెంబర్ 23 న పి.వి.నరసింహారావు కన్నుమూసాడు. ఆయనకు ముగ్గురు కొడుకులు, ఐదుగురు కుమార్తెలు ఉన్నారు.
#Pamulaparthi Venkata Narasimaharao.
#Adithyapakide.







No comments:

Post a Comment

Mana muchatlu: World water day by Adithya Pakide

Mana muchatlu: World water day by Adithya Pakide pakideadithya@Gmail.com : ప్రపంచ జల దినోత్సవం: ప్రపంచ జల దినోత్సవాన్ని ఐక్య రాజ్య సమితి ...