Thursday, November 16, 2017

National press day by adithyapakide



జాతీయ పత్రికా దినోత్సవం:


అధికారంలో ఉన్న వ్యక్తుల చేత, వ్యవస్థల ఇష్టాయిష్టాల వల్ల ప్రభావితం కాకుండా శక్తిమంతమైన ప్రసారమాధ్యమంగా అత్యున్నత ప్రమాణాలను పాటించేలా చూడటం లక్ష్యంగా భారతదేశంలో నవంబర్‌ 16, 1966వ సంవత్సరంలో ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా స్థాపించారు. ప్రతిసంత్సరం ఈ రోజున నేషనల్‌ ప్రెస్‌ డే (జాతీయ పత్రికా దినోత్సవం) గా జరుపుకుంటారు.
సాంకేతిక విప్లవం తో వార్తలు అందించే తీరు మారినది. రేడియోలు పోయి టెలివిజన్లు వచ్చి సంఘటనలను కళ్ళముందుకు తెచ్చాయి . వార్తలను జరిగిన తరువాత చూపించడం ఆగి , జరుగుతూండగానే ప్రత్యక్ష ప్రసారము చేయగలుగుతున్నాయి . న్యూస్ చానెళ్ళు వచ్చిన తర్వాత ప్రతి నిమిషము ఒక కొత్త వార్తని తాజా కబురంటూ అందిస్తున్నాయి. ఇంటర్నెట్ లో వార్తలు ఎప్పటికప్పుడు అందుతున్నాయి. ఇన్ని రకాలుగా వార్తలు అందుకునే అవకాశము ఏర్పడినా వార్తలను అందుకుంటున్నా నేటికీ ప్రజలు వార్తలకోసం చివరిగా నమ్మేది వార్తాపత్రికలను మాత్రమే . ఒక చేతితో వార్తా పత్రిక మరో చేతిలో కాఫీ కప్పు ... అది ఒక రకమైన సామాజిక హోదాకు చిహ్నము . ఇది ఒక భాషకు , ఒక ప్రాంతానికి పరిమితమైన విషయము కాదు . ప్రపంచవ్యాప్తం గా వార్తా పత్రికలకు ఏమాత్రము ఆదరణ తగ్గలేదని చెప్పేందుకు ఎన్నో సాక్ష్యాలలో ఇది ఒకటి .

టెలివిజన్‌ లో ఎవరో చెపితే వార్తను వినాలి . వారు చూపించిన కోణం లోనే వార్త దృశ్యాన్ని చూడాలి . తన ఊహకు ఏమాత్రము తావుండదు . వార్తను మధ్యలో ఆపుకుని పక్కవాడితో మాట్లాడేందుకు , వార్తాంశాన్ని చర్చించేందుకు ఎంతమాత్రము వీలుండదు . కాని ఆ సౌకర్యము వార్తా పత్రికల్లో ఉంటుంది.  పత్రికల్లో చదివే వార్త కూడా మరెవరో రాసినదే కావచ్చు కాని ఆ విలేకరి రాసిన వార్త చదువుతుండగానే సొంత విశ్లేషణ మనసులో మొదలు పెట్టుకునే అవకాశము పాఠకుడుకి ఉంటుంది . ఈ సౌకర్యము టెలివిజన్‌ ప్రేక్షకుడుకి ఉండదు . అందుకే ఓ మోస్తరు పరిజ్ఞానము కలిగిన వారు వార్తాపత్రికల వైపే ఓటు వేస్తుంటారు . ప్రపంచ వ్యాప్తంగా వార్తాపత్రికల నిర్వహణ విషయములో సంక్షోభము తలెత్తినది . టెలివిజన్‌ దాడికి వార్తాపత్రికలు తట్టుకోగలవా అనుకున్నారు . టెలివిజన్‌ దెబ్బకు పత్రికల సర్క్యులేషన్‌ పడిఫోయినా ఆ దెబ్బ తాత్కాలికమే అయింది . క్రమముగా పత్రికా రంగము తిరిగి పుంజుకుని టెలివిజన్‌ కి ధీటుగా నిలబడిందని విశ్లేషకులు భావిస్తున్నారు . అయినా కొంత సర్క్యులేషన్‌ తగ్గినా అక్కడ స్థిరముగా నిలబడగలిగినది .

మన దేశంలో పత్రికల ప్రారంభం:

మన దేశ వార్తాపత్రిక వ్యవస్థకు పునాది 1780 సంవత్సరములో పడింది . ఆనాటికి పాలన బ్రిటిష వారి చేతిలోకి వెళ్ళింది . కలకత్తా నగరము రాజధానిగా పాలన సాగిస్తున్న కాలము . అటువంటి సమయములో తొలి వార్తాపత్రిక గా " హికీస్ బెంగాల్ గెజిట్ " అనేది జనవరి 29-1780 న విడుదల అయింది . ఆ సంవత్సరములోనే కలకత్తా లో రైటర్స్ బిల్డింగ్ నిర్మాణము కూడా పుర్తయింది . బెంగాల్ గెజిట్ తొలి సంచిక విడుదల అయిన జనవరి 29 ని వార్తాపత్రికా దినోత్సవం గా జరుపుకుంటున్నారు . ఆ పత్రికను ప్రచురించినది " జేమ్స్ అగస్టిన్‌ హిక్ " అందుకే అతని పేరు ... అది ప్రచురితమవుతున్న ప్రాంతమైన బెంగాల్ ను కలిపి ' హికీస్ బెంగాల్ గెజిట్ ' అన్నారు . ఆ పత్రికలోనే తొలి వ్యాపార ప్రకటన విడుదలైంది . వ్యాపార ప్రకటనల్కు నిలయమైన పత్రిక కాబటీ దీనిని ' ఒరిజినల్ కలకత్తా జనరల్ అడ్వటైజర్ ' అని కూడా పిలిచేవారు . అప్పటికి భారతదేశములో అక్షరాస్యత తక్కువ , ఇంగ్లిష తెలిసినవారూ తక్కువే అయినా వార్తా పత్రికకు తగినంత ఆదరణ లభించింది . ఈ ప్రజాదరణ గమనించిన కొందరు కొత్త వార్తాపత్రికల్ని ప్రచురించసాగారు . వీటిలో ఇండియన్‌ గెజిట్ , కలకత్త జర్నల్ , బెంగాల్ హరాకరు , జాన్‌ బుల్ ఇన్‌ ది ఈస్ట్ వంటివి ఉన్నాయి .

భారతీయులు ప్రముఖం గా భారతీయ పత్రికా రంగం లోకి అడుగు పెట్టింది 1851 లో దాదాభాయ్ నౌరోజి ద్వారా ఆయన ప్రారంభించిన ఒక రాజకీయ పత్రిక వలన . స్వాతంత్ర భావాలు ను ప్రచారము చేయడం ధ్యేయము గా ఆ పత్రికలు పనిచేశాయి. ప్రత్రికలలో వస్తున్న ప్రమాదం బ్రిటిష్ పాలకులు గుర్తించారు .. తమ పాలనకు వ్యతిరేకం గా వచ్చే వార్తల్ని అడ్డుకునే లక్ష్యము తో 1878 లో సెన్సార్ చట్టాన్ని అమలులో పెట్టారు . అయినా నాయకులు ఏమాత్రము వెనుకంజవేయలేదు . ఎఫ్.సి.మెహతా 1882 లో కైసర్-ఎ-హింద్ పత్రికను ప్రారంభించారు. తాను చేపట్టిన సామాజిక సంస్కరణల ప్రచారానికి రాజా రామమోహన రాయ్ కూడా తన సొంత పత్రికను ప్రారంభించారు . పత్త్రికలకున్న పాత్రను స్వాతంత్ర్యయ పోరాటం లో పాల్గొన్న ప్రతీ నాయకుడు గుర్తించాడు . దాదాపు తొలితరం నాయకులందరూ తమ తమ ప్రాంతీయ భాషలలో గాని , ఇంగ్లీషులో లో గాని పత్రికలు నిర్వహించారు . స్వాతంత్ర్య సమరములో పత్రికలు పో్షించిన పాత్ర అమోఘము . విద్యావ్యాప్తిలో పత్రికల సంఖ్య పెరిగింది . స్వాతంత్ర్యము సిద్ధించేనాటికి మనదేశములో 10 ముండి 12 ఆంగ్ల దినపత్రికలు ప్రముఖంగా ప్రచారములో ఉన్నాయి. వీటిలో టైమ్స్ ఆఫ్ ఇండియా , స్టేట్స్ మన్‌ , పయనీర్ పత్రికలు బ్రిటిష్ యజమానులు నడిపించేవారు . జాతీయ భావముతో చెన్నపట్నం లో " ది హిందూ" , ముంబై లో " ఇండియన్‌ ఎక్ష్ప్ ప్రెస్ " ఢిల్లి లో " హిందుస్తాన్‌ టైమ్స్ , కలకత్తాలో ' అమృత బజార్ ' ఉత్తర భారతం లో ' నేషనల్ హెరాల్డ్ ' , మధ్య భారత లో ' హితవాద ' వెలువడుతుండేవి . మద్రాస్ నుండి ' మెయిల్ ' అనే మరో దినపత్రిక కూడా వచ్చేది . ఆంగ్ల భాషాపత్రికలతో పాటుగా ప్రాంతీయ భాషలలోనూ పత్రికా రంగం వ్యాప్తిచెందింది .
అన్ని భాషలవారూ పత్రికల ప్రచురణలో పోటీపడి ప్రచురించేవారు . ప్రతి భాషలో కొన్ని పత్రికలు అత్యున్నత స్థాయికి చేరడం ,ఆ తర్వాత కనుమరుగవడం జరిగింది .

తెలుగు పత్రికల చరిత్ర:

తెలుగునాట పాఠకులను విశేషం గా కదిలించిన పత్రికలు ' ఆంధ్ర పత్రిక ' కృష్ణా పత్రిక ,లు వాటి ప్రాచుర్యము క్రమముగా కోల్పొయీ మూతబడ్డాయి . తెలుగు భాషకు సంబంధించినంతవరకు నిర్విఘ్నముగా వెలువడుతున్న వార్తాపత్రిక గా ' జమీన్‌ రైతు ' ని పేర్కొనవచ్చును . ఎనిమిది శతాబ్దాలకు పైగా ప్రచురణ చరిత్ర దీనికున్నది . మిగిలిన దేశాలలో ఎలా ఉన్నా మనదేశములో వార్తాపత్రికలు తొలి నుండి ఒక స్వతంత్ర విధానాన్ని అనుసరిస్తూనే వచ్చాయి . మన దేశములో వార్తాపత్రికలు ప్రారంభమైన తొలిరోజుల్లో ' గెజిట్ ' తన మోటో గా ఒక చక్కని వాక్యం పచురించింది . " మాది ఒక రాజకీయ , వ్యాపార పత్రిక ... అన్ని రాజకీయ పార్టీలకు స్థానము కల్పిస్తాం కాని ఏ రాజకీయ పార్టీ ప్రభావానికి లోను కాము " అన్న నాటి గెజిట్ లక్ష్యమే నేటికీ పత్రికలకు ఆదర్శము గా నిలుస్తుంది . ప్రాంతీయ భాషలలో కొన్ని పత్రికలు కొన్ని పార్టీల కొమ్ము కాసేవిగా ముద్రపడ్డాయి . అయితే అటువంటి రాజకీయ ముద్ర ఆయా పత్రికల ఎదుగుదలను ఏదో ఒక సమయం లో దెబ్బతీస్తుంది . రాజకీయ పార్టీలు తమ సిద్ధాంత ప్రచారానికి తమ కంటూ సొంత పత్రికలు ఉండాలని భావించాయి. అటువంటి పార్టీలలో నేటికీ తమ సొంత పత్రికలను నడుపుకుంటున్నావారు ... కమ్యూనిస్టులు . సి.పి.ఐ., సి.పి.ఎం. వారు అన్ని జాతీయ భాషలలో పత్రికలు నడుపుతున్నారు . కొన్ని సంస్థలు పత్రికల్ను నిర్వహిస్తున్నాయి . పాంచజన్య , ఆర్గనైజర్ వంటి పత్రికలు , ఆర్.ఎస్.ఎస్. అనుబంధ సంస్థలు ప్రచురిస్తున్నాయి. పత్రికలలో పెద్ద పీట రాజకీయ పత్రికలదే . ప్రాంతీయ భాషలలో పత్రికలకు అధిక ఆదరణ ఉండడం గమనించిన జాతీయ స్థాయి పత్రికలు ప్రాంతీయ ఎడిషన్లను ప్రారంభంచాయి. ఇండియా టుడే , సండే ఇండియన్‌ వంటి ఆంగ్ల పత్రికలు దక్షిణాది భాషలలో కూడా తమ ప్రచురణలు మొదలు పెట్టాయి . దేశ రాజధాని అయిన ఢిల్లి నగరం నుంచి పలు ప్రాంతీయ భాషా వార్తాపత్రికల ప్రచురణ ప్రారంభమైంది . ఢిల్లిలో మొత్తం 15 భాషలలో వార్తాపత్రి కలు వస్తున్నాయి . ప్రపంచములో మరే ఇతర దేశ రాజధానిలో ఇన్ని భాషల పత్రికలు విడుల అవడం లేదు . ఢిల్లీ నగరం లో మొత్తం 117 రకాల దినపత్రికలు ఒక షాపులో అందుబాటులో ఉండడం గమనించి ప్రపంచ పత్రికలన్నీ ఆశ్చర్యముతో ఘనం గా ప్రకటించాయి . ఇది ఒక రికార్డు. భారతదేశ జనాభాలో పత్రికలు చదివే పాఠకులు 35 శాతమే ఉన్నారు . అందులో కేవలం 17 శాతము మంది మాత్రమే పత్రికలను కొని చదువుతారు . మిగిలినవారు పత్రికలను పంచుకొని లేదా లైబ్రరీలలో చదువుతుంటారు . పత్రికలను కొని చదివే అలవాటు తెలుగువారిలో తక్కువగా ఉండడం భాధాకరమైన విషయమే. తమిళనాడు లో పత్రికలు కొని చదివే అలవాటు ఎక్కువ అవడం మూలాన పత్రికా రంగం బలము గా స్థిరము గా ఉంది . ఇక్కడ పత్రికలు ఇతర భాషలపత్రికలకన్న తక్కువ ధరకే అందించగలుగుతున్నాయి .

ఇటీవల ఒక సర్వే ప్రకారంఇంగ్లిష్ పత్రికలను సామాజిక హోదాకి ప్రతిబింబము గా భావిస్తుంటారు భారతీయులు .. ఆ పత్రికలలోని అంశాలు చదివినా చదవక పోయినా వాటిని తమ డ్రాయింగ్ బల్ల మీద అందంగా అమర్చివుంచడం చాలా ఇళ్ళలో కనిపిస్తుంది .ఈ విషయం  పత్రికా సర్వేలో వెల్లడైనది . అందుకే మన దేశము లో హిందీ పత్రికల సర్క్యులేషన్‌ 3.5 నుండి 4.0 కోట్లవరకు ఉంటే ... ఇంగ్లిష్ పత్రికల సర్క్యులేషన్‌ 1.2 కోట్ల దగ్గర ఉన్నది . టెలివిజన్‌ చానల్స్ కి దీటుగా పత్రిక సంఖ్య ఉంటుంది . పత్రికా నిర్వహణ లోకి కొత్తవారు ప్రవేశిస్తున్నారు . కొత్తదనం తీసుకొస్తున్నారు. పత్రికారంగం మంచి పోటీరంగం అయింది. పెరుగుతున్న సాంకేతిక ప్రక్రియను తగిన రీతిలో వినియోగించుకోగలిగిన వారికి పాఠక ఆదరణ ఏమాత్రం తగ్గడం లేదన్నది నిజము .

పత్రికారంగం ఎదుర్కొంటున్న సంక్షోభాలు:

విశ్లేషకుల అంచనా ప్రకారం ఇటీవల కాలం లో ప్రపంచవ్యాప్తం గా పత్రికా రంగం సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది . ఆర్ధిక సంక్షోభం తోడుగా టెలివిజన్‌ , ఇంటర్నెట్ దెబ్బకు ఆంగ్ల భాషాపత్రికలు బాగా దెబ్బతింటున్నవి.ఐరోపా , అమెరికా ఖండాలలో పత్రికలు పాఠకుల ఆదరణ పొందలేకపోయాయి . ఇటీవల సర్వే ప్రకారము ఐరోపా ఖండం లో పత్రికా పాఠకుల సంఖ్య కేవలం 4.80 కోట్లే. అదే అమెరికాలో ఆ సంఖ్య 9.70 కోట్లు . ఆ రెండు ఖండాలలోని పత్రికా పాఠకుల కలిపిన సంఖ్య కంటే ఎక్కువ మంది భారతదేశములో ఉన్నారు . మన దేశ పత్రిక పాఠకుల సంఖ్య 15 కోట్లు పైనే ఉంటారు అని అంచనా . ప్రపంచం మిగతా ప్రాంతాలలో పాఠకుల సంఖ్య తగ్గుతుంటే భారత్ లో ఏటా 8 శాతము వంతున పెరుగుతుంది . ఇది పత్రికారంగానికి , పాఠకులకు ఆనందం కలిగించే విషము . వార్తా ప్రసారరంగం లో పత్రికలదే పైచేయి అనే విషయము వాణిజ్య ప్రకటనారంగం కూడా నిర్ధారిస్తుంది . మిగిలిన ఎన్ని రకాలుగా వ్యాపార ప్రకటనలు విడుదల చేసినా వినియోగదారుడి మీద ప్రభావం చూపేది మాత్రం పత్రికా ప్రకటనలే అని వారు భావిస్తున్నరు . పత్రికల్లో ప్రకటనలు ఒకటికన్నా ఎక్కువసార్లు పాఠకుల దృష్టిని ఆకర్షిస్తుంది . అందుకే అడ్వర్టైజింగ్ బడ్జెట్ లో పత్రికా ప్రకటనకే ఎక్కువ కేటాయిస్తున్నారు


పత్రికలు అందించే సమాచారం:

నేడు పత్రికలు కేవలం వార్తలు మాత్రమే అందించడం లేదు . అన్ని వర్గాలవారికి సంబంధించిన అంశాలను , క్రీడలు , విజ్ఞానం , ఆరోగ్యము , యువతకు సంబంధించిన అంశాలు మున్నగు పలు రకాల విషయాలు ప్రజకు అందిస్తున్నాయి. అది పత్రికలు సమాజానికి చేస్తున్న సేవ . విద్య , ఉపాధికి సంబంధిచిన అంశాలు ప్రత్యేకం గా అందిస్తున్నారు . ఆయా అంశాలకోసం ప్రత్యేక పత్రికలే వెలువడుతున్నాయి . ఆరోగ్యము , మహిళా అంశాలు , సినిమా , హాస్యము ఇలా విడివిడిగా ప్రతి అంశాన్ని ప్రతేకంగా ప్రచురిస్తున్న పత్రికలూ ఉన్నాయి . సాంకేతిక ప్రగతిని పత్రికల తయారీలో  ఉపయోగించుకుంటున్నారు .

No comments:

Post a Comment

Mana muchatlu: World water day by Adithya Pakide

Mana muchatlu: World water day by Adithya Pakide pakideadithya@Gmail.com : ప్రపంచ జల దినోత్సవం: ప్రపంచ జల దినోత్సవాన్ని ఐక్య రాజ్య సమితి ...